మాదక ద్రవ్యాల సరఫరా కేసులో ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైలులో ఉంటున్న ఆ వ్యక్తి ఎలాగోలా ఓ సెల్ఫోన్ సంపాదించాడు. అప్పట్నుంచి సెల్ఫోన్ ద్వారా బయటప్రపంచంతో టచ్లో ఉన్నాడు. అయితే శనివారం రోజున పోలీసు అధికారులు కారాగార తనిఖీలు చేపట్టారు. జైలులోని ఖైదీలను పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో తన దగ్గర ఉన్న ఫోన్ను మింగేశాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన బిహార్లోని గోపాల్గంజ్ జిల్లా చోటుచేసుకుంది.
ఖైసర్ అలీ అనే వ్యక్తి కొన్నిరోజులుగా జైలులో సెల్ఫోన్ వాడుతున్నాడు. శనివారం రోజున పోలీసులు ఖైదీలను తనిఖీ చేస్తున్న సమయంలో.. తాను ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో తన దగ్గర ఉన్న ఫోన్ను మింగేశాడు. ఆదివారం ఖైదీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన గోపాల్గంజ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎక్స్రే పరీక్షలు నిర్వహించగా.. ఏదో వస్తువు ఉన్నట్లు ఆ డాక్టర్లు గుర్తించారు.
మెరుగైన పరీక్షలకు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించగా.. ఫోన్ మింగేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 2020లో మాదక ద్రవ్యాల కేసులో ఈ ఖైదీ అరెస్టు అయ్యాడు. ఈ ఘటనతో జైళ్లలో మొబైల్ వినియోగంపై అక్కడి అధికారులు నిఘా ఉంచారు.