దేశంలో రైతులు తాము పండించే పంటలకు అసలు గిట్టుబాటు ధరను పొందడం లేదు. దీంతో పెద్ద ఎత్తున చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పంటకు అసలు ధర రావడం లేదు. దీంతో వారు చాలా తక్కువ ధరలకే తమ పంటలను అమ్ముకోవడమో, రోడ్డుపై పంటను పారబోయడమో చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూపీ రైతు తాజాగా తన 1000 కిలోల కాలిఫ్లవర్ పంటను రోడ్డుపై పారబోశాడు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ సలీం అనే రైతు రూ.8వేలు ఖర్చు పెట్టి అర ఎకరం పొలంలో కాలిఫ్లవర్ పంటను వేశాడు. దీంతో 1000 కిలోల పంట చేతికి వచ్చింది. ఈ క్రమంలో అతను రూ.4వేలు ఖర్చు పెట్టి ఆ పంటను సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌కు తరలించాడు. అయితే ఆ పంటకు కిలోకు కేవలం రూ.1 మాత్రమే ఇస్తామని చెప్పారు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చి పంట మొత్తాన్ని రోడ్డుపై పారబోశాడు.
గతంలో కాలిఫ్లవర్ పంటకు కిలోకు రూ.12 నుంచి రూ.14 ధర వచ్చేది. తాను కిలోకు కనీసం రూ.8 అయినా రాకపోతుందా ? అని భావించానని కానీ మరీ రూ.1 అంటే రవాణా ఖర్చులు కూడా రావని, అందుకనే పంటను మళ్లీ తీసుకెళ్లి రవాణా ఖర్చులను అనవసరంగా చెల్లించడం ఇష్టం లేక కాలిఫ్లవర్ మొత్తాన్ని రోడ్డుపై పారబోశానని అతను తెలిపాడు. తాను పంట కోసం చేసిన అప్పును చెల్లించేందుకు ఇప్పుడు కూలి పనిచేయాలని, ఇంట్లో తనపై ఆధారపడి తన తల్లి, కుటుంబ సభ్యులు ఉన్నారని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని అతను వాపోయాడు.