ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో రైలులో ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ఆ తర్వాత నెమ్మదిగా మంటలు మొదలయ్యాయి. గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలు నిలిపివేశారు. బయటకు వద్దామని డోర్ దగ్గరికి రాగా.. రైలు వంతెనపై ఆగిన విషయం చూసి షాకయ్యారు. వెంటనే ఆ వంతెనపై నెమ్మదిగా నడుచుకుంటూ కొందరు ప్రాణాలు నిలుపుకోగా.. మరికొందరు వంతెనపై నుంచి నదిలో దూకారు.
ఆదివారం రోజున లక్నో నుంచి చండీగఢ్ వెళ్తున్న సద్భావనా ఎక్స్‌ప్రెస్ బ్రేక్ల నుంచి పొగ వచ్చింది. రైల్లో మంటలు అంటుకున్నట్లు భావించిన ప్రయాణికులు చైన్ లాగారు. రైలు లక్సర్ ప్రాంతంలోని రైసీ రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే బాణ్గంగా నదిపై ఆగింది. ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వంతెన అంచు నుంచి నడుచుకుని ముందుకు వెళ్లారు. కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోడానికి నదిలోకి దూకినట్లు అక్కడున్న కొందరు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బ్రేకులను పునరుద్ధరించారని.. అనంతరం రైలు బయలుదేరినట్లు సమాచారం.