థర్డ్ ఫ్రంట్: కేసీఆర్‌ను నమ్మేదెవరు.. వెంట నడిచేదెవరు

-

బీజేపీ, కాంగ్రెస్‌ లేని థర్డ్ ఫ్రంట్ కోసం తెరాస అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకోసం ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా సీఎం కేసీఆర్ నమ్మేదెవరు అని ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. ఒకవేళ నమ్మినా వెంట వచ్చేదెవరో కూడా చెప్పలేని పరిస్థితి. నమ్మి వచ్చినా ఆయన సారథ్యాన్ని అంగీకరిస్తారా? అనేది కూడా సందేహమే.

అదీ 2019, సార్వత్రిక ఎన్నికల సమయం. సారు కారు పదహారు సర్కారు అనే నినాదంతో తెరాస బరిలోకి దిగింది. పోలింగ్ ముగిసింది. ఫలితాలు వచ్చాయి. డామ్మిట్ కథ అడ్డం తిరిగింది. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో సారు కారు పదహారు సర్కారు నినాదం బెడిసి కొట్టి ఏడు స్థానాలకే టీఆర్‌ఎస్ పరిమితమైంది. అప్పటివరకు జాతీయ రాజకీయాలపై హంగామా చేసిన కేసీఆర్ ఒక్కసారిగా సైలెన్స్ అయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఉసేత్తడం మానేశారు. పైగా ‘కీలక’ సమయాల్లో బీజేపీ పార్లమెంట్ ఉభయ సభల్లో మద్దతు కూడా ఇస్తూ వచ్చారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ వైఖరి మారింది. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మళ్లీ థర్డ్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్నారు. డీఎంకే, సీపీఐ(ఎం ), సీపీఐ, ఆర్‌జేడీ అగ్రనేతలను కలుస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్‌యేతర కూటమి కోసం కృషి చేస్తున్నారు. పైకి ఆయా పార్టీల నేతలు కేసీఆర్‌ను కలుస్తున్నా భవిష్యత్తును మాత్రం వెల్లడించడం లేదు. ఇందుకూ ఓ కారణం ఉన్నది.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి ఖాయమని సీఎం కేసీఆర్ నమ్ముతున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నారని రాజకీయ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే, థర్డ్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్నారని ప్రచారం జరుగుతున్నది.

ఒకవేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే.. అప్పుడు టీఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ ‘పాత పద్ధతి’ అవలంబిస్తే పరిస్థితి మొదటికి వస్తుంది. అందుకే కేసీఆర్ ఎత్తుకున్న థర్డ్ ఫ్రంట్ నినాదంపై ప్రాంతీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఏదిఏమైనా ఐదు రాష్ట్రాల ఎన్నిలక తర్వాతనే కేసీఆర్ నమ్మేదెవరు వెంట నడిచేదెవరు అనేవి తేలుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news