ఇప్పటిదాకా యాభైకి పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు సీఎం జగన్. వీటి నిర్వహణ ఎలా ఉన్నా కూడా కొత్త కార్పొరేషన్ల ప్రతిపాద నలు వస్తూనే ఉన్నాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా కొత్త కార్పొరేషన్ల ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. అక్కడ రెడ్డి కార్పొరేషన్ కావాలని పట్టుబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్య వైశ్య కార్పొరేషన్ కూడా అడుగుతున్నారు.

ఇక్కడ మాత్రం అన్ని కులాలకూ కార్పొరేషన్లు ఉన్నాయి. తాజాగా మాదిగ కార్పొరేషన్ కోసం జగన్ ను అడుగుతున్నారు. మొన్నా మధ్య కొందరు జగన్ ను కలిసి తమ విన్నపం చెప్పారు కూడా ! అయితే దీనిని జగన్ సున్నితంగా తోసి పుచ్చారు. మాదిగల కోసం కొన్ని పథకాలు ఉన్నాయి కదా ! చేయూత, ఆసరా వంటి పథకాలు ఉన్నాయి కదా వాటిని వాడుకోండి. ఇప్పటికే చాలా కార్పొరేషన్లు ఉన్నాయి ఇప్పుడెందుకు ఈ కొత్త ప్రతిపాదన అంటూ సున్నితంగా వారించారు.
వాస్తవానికి కుల కార్పొరేషన్లు ఎన్ని ఉన్నా కొత్త వాటికి ప్రతిపాదనలు రావడంలో తప్పేం లేదు. కానీ వాటికి నిధులు ఇవ్వగలరా లేదా అన్నదే చాలా ప్రధానం. ఎందుకంటే పథకాలకు సంబంధించిన నిధులనే ప్రధానంగా చూపిస్తూ కార్పొరేషన్ల నడక అన్నది సాగిస్తున్నారు కానీ కొత్తగా వాటికి అంటూ ఏ ప్రత్యేక కేటాయింపులూ లేవు. ఆ విధంగా చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ కూడా అంగీకరించడం లేదు.

కొంతలో కొంత ప్రాధాన్యం ఉన్న కులాలు వాటి కార్పొరేషన్ల పేరిట కొంత లాబీయింగ్ చేసి కొన్ని పథకాలు తమ వారికి ముఖ్యంగా అర్హత ఉన్న వారికి వర్తింపజేసేలా చేసుకుంటున్నాయే కానీ అందరికీ అవి న్యాయం చేయడం లేదు అన్న వాదన కూడా ఉంది. అసలు కార్పొరేషన్ చైర్మన్లకే ఇప్పటిదాకా సవ్యంగా జీతాల చెల్లింపు అన్నదే లేదన్న విమర్శ కూడా ఉంది. కనుక కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో మాదిగలకు కానీ ఏ ఇతర సామాజికవర్గానికి కూడా మేలు జరగదు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ కార్పొరేషన్ కింద గతంలో అమలయిన చాలా పథకాలు, రుణాలు అన్నవి ఇవాళ రద్దయిపోయాయి. వాటి పునరుద్ధరణకు పట్టు బడితే మేలు.