డిసైడ్ అయిందా లేదా డిసైడ్ చేశారా అన్నది ఇప్పుడు ఒక చర్చ. ఎందుకంటే ఏపీ రాజకీయాల కన్నా టీజీ పరిణామాలే అత్యంత ఆసక్తికరంగా అప్పుడప్పుడూ ఉంటాయి. మలుపులు, మధ్యవర్తుల మాటలు, అలకలు, ఆధిపత్య ధోరణులు, ఆశలూ, ఆశనిపాతాలు ఇలా ఎన్నో ఉంటాయి. అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే ఎపుడు అని పాడుకునేందుకు వీలున్న రాష్ట్రం తెలంగాణ.
ఆ విధంగా రాజకీయ యుద్ధం ఎప్పుడూ ఏక పక్షం కాలేదు ఇకపై కాబోదు కూడా ! ఫలితం ఏకపక్షం కావొచ్చు కానీ యుద్ధం మాత్రం కడదాకా చేయాల్సిందే ! చేశాకనే విజయమో వీర స్వర్గమో అన్నది తేలాలి.. తేలింది కూడా ! ఆ విధంగా కేసీఆర్ కోటలో కొత్త ప్రతిపాదనలు కొన్ని వినిపిస్తున్నాయి. ఆ విధంగా కేసీఆర్ గారాలపట్టి కవితకు కొత్త పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. అందుకు తగ్గ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ ఉత్సవం ఈ నెల 27న హైటెక్స్ (మాదాపూర్, భాగ్యనగరి)లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కవితక్కకు అదేవిధంగా తారక రాముడికి మంచి స్థాయిలో పదవులు ఇవ్వాలని,
పార్టీ పరంగా వారి నాయకత్వ రీతులని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా అనౌన్స్ చేశాక, నేషనల్ కో ఆర్డినేటర్ గా కవితక్కను నియమిస్తూ ప్లీనరీలో భాగంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వ్యవహారాలపై మంచి పట్టున్న నేతగా ఆమెకు పేరుంది. గతంలో ఎంపీగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే దేశ రాజకీయాల్లో పార్టీ వ్యవహారాలను సమన్వయ పరిచే బాధ్యతను ఆమెకు అప్పగించేందుకు కేసీఆర్ సన్నద్ధం అయ్యారని తెలుస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని కీలక పదవులకు కేసీఆర్ తన సొంత మనుషుల నియామకాన్ని షురూ చేయనున్నారు అని సమాచారం.