దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్(డీఎఫ్‌ఐ) సంయుక్తంగా రూపొందించిన కమిట్‌మెంట్ టు రెడ్యూజింగ్ ఇనిక్వాలిటీ ఇండెక్స్(సీఆర్‌ఐఐ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ఆరోగ్యంపై వ్యయంలో భారత్ అట్టడుగు స్థానంలో కొనసాగుతూనే ఉన్నది. 161 దేశాల జాబితాలో 2022లో మరో రెండు స్థానాలు దిగజారి 157వ స్థానానికి చేరింది. అంటే చివరి నుంచి ఐదో స్థానం అన్నమాట.
ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ మాట్లాడుతూ ప్రజారోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం 2019, 2021 మధ్య ఆరోగ్యంపై ఖర్చులో కోతలు పెట్టిందని విమర్శించారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో మోదీ సర్కార్ స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయని, ఆరోగ్య పరిరక్షణలో మెరుగవాల్సిన సమయంలో నిధులు తగ్గించడం బాధాకరమని అన్నారు. కాగా, అసమానతలను తగ్గించడంలో భారత్ స్వల్పంగా ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్నదని, అయినప్పటికీ 123 ర్యాంకులోనే ఉన్నదని నివేదిక తెలిపింది.