కేంద్ర మంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు : నితీశ్ కుమార్

-

ఇటీవల భాజపాతో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన మాజీ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్‌ గతేడాది కేంద్రమంత్రివర్గంలో చేరడంలోనూ తన అంగీకారం లేదని నితీశ్ స్పష్టంచేశారు.

ఇటీవల నితీశ్‌ కుమార్‌ ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. భాజపా-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా కొనసాగిన నితీశ్‌.. తన పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ-కాంగ్రెస్‌-వామపక్షాల సారథ్యంలోని మహాకూటమితో చేతుల కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొన్న నితీశ్‌ ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో నితీశ్‌పై భాజపా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news