సినిమా ప్రియులకు సుప్రీంకోర్టు షాక్‌.. థియేటర్స్‌ వెళితే అంతే..!

-

ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం వల్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చంది. శిశువుల కోసం తల్లిదండ్రులు తెచ్చిన ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి లేదని ఆదేశించింది. ప్రేక్షకులు తెచ్చుకున్న ఆహారాన్ని థియేటర్లు అనుమతించాలని కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తోసిపుచ్చింది. మంగళవారం ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, థియేటర్లలో ఉచితంగా తాగునీరు అందించడాన్ని మాత్రం కొనసాగించాలని కోర్టు పునరుద్ఘాటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. 2018 లో జమ్ముకశ్మీర్‌ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.

సినిమా హాలు ప్రైవేట్ ఆస్తి అని, అలాంటి నిబంధనలను ఆయా థియేటర్ల యాజమాన్యాలు విధించుకోవచ్చునని ధర్మాసనం పేర్కొన్నది. ప్రేక్షకుడు సినిమా హాల్లోకి ప్రవేశించే సమయంలో ఆయా సినిమా హాళ్ల యజమాని పేర్కొన్న నిబంధనలను పాటించాలని కోర్టు సూచించింది. మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలను విక్రయించడం అనేది వాణిజ్యపరమైన అంశం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లకు వచ్చే వారు తమ సొంత తినుబండారాలను తీసుకెళ్లేందుకు అనుమతించిన జమ్ముకశ్మీర్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కన పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version