ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా సూపర్‌స్టార్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఆవిర్భవించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3,7-6(7/4),7-6(7/5) తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. తొలి సెట్ ను సునాయాసంగా గెలిచిన జకో… ఆ తర్వాత రెండు సెట్లలో సిట్సిపాస్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే ఆ రెండు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లగా, జకోవిచ్ పైచేయి సాధించాడు. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చాంపియన్ గా నిలవడం జకోవిచ్ కు ఇది పదోసారి. అంతేకాదు, ఈ టైటిల్ తో జకోవిచ్… రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేశాడు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్లుగా జకోవిచ్ (22), నాదల్ (22) సమవుజ్జీలుగా నిలిచారు. దీంతో గత సీజన్‌కు దూరమై అవమానపడ్డ నోవాక్.. ఈసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు. నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్ గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్‌ను 6-3తో జకోవిచ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత సెర్బియా స్టార్ రెండో, మూడో సెట్లలో విజయం సాధించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది.