హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శతాబ్ది ఉత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ అధికారులు భారీ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
అయితే.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేత సీతారాం ఏచూరి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, అల్లు అరవింద్, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్, తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్, కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, బాబూమోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమకు ప్రముఖులు నివాళులు అర్పించారు.