షాకింగ్‌.. మ‌హిళ‌కు రెండు కోవిడ్ టీకా డోసుల‌ను వెంట వెంట‌నే ఇచ్చిన న‌ర్సు..

-

కోవిడ్ టీకాల పంపిణీ దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొన‌సాగుతోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నారు. అయితే కాన్పూర్‌లో కోవిడ్ టీకాల పంపిణీలో భాగంగా షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ న‌ర్సు ఓ మ‌హిళ‌కు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల‌ను వెంట వెంట‌నే ఇచ్చింది. దీంతో స్థానికంగా క‌ల‌క‌లం చోటు చేసుకుంది.

కాన్పూర్‌లోని మండౌలి గ్రామానికి చెందిన క‌మ్లేష్ కుమారి అనే మ‌హిళ స్థానికంగా ఉన్న ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకా తీసుకునేందుకు వ‌చ్చింది. అందుకు అవ‌స‌రం అయిన పేప‌ర్ వ‌ర్క్‌ను పూర్తి చేసింది. ఈ క్ర‌మంలో ఆమెకు అర్చ‌న అనే ఓ న‌ర్సు కోవిడ్ టీకాను ఇచ్చింది. అయితే ఆ స‌మ‌యంలో ఆ న‌ర్సు ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉంది. దీంతో క‌మ్లేష్ కుమారికి టీకా ఇవ్వ‌లేద‌నుకుందో, ఏమో.. తెలియ‌దు కానీ ఆమెకు మ‌ళ్లీ టీకా ఇచ్చింది. దీంతో క‌మ్లేష్ కుమారి రెండు డోసుల‌ను వెంట వెంట‌నే తీసుకుంది.

అయితే వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన బాధిత మ‌హిళ త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యాన్ని చెప్ప‌గా వారు అక్క‌డి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆఫీస‌ర్ ఫిర్యాదు స్వీక‌రించి ద‌ర్యాప్తు చేస్తున్నారు. సాధార‌ణంగా కోవిడ్ టీకా రెండో డోసును 6 నుంచి 8 వారాల త‌రువాత తీసుకోవాలి. కానీ ఆ నర్సు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆ మహిళ‌కు రెండు డోసుల‌ను వెంట వెంట‌నే ఇచ్చింది. ఆ మ‌హిళ‌కు ఏమైనా అయితే ఆ న‌ర్సు తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని స‌ద‌రు ఆఫీస‌ర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version