భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ప్రసంగించారు. న్యాయవాద వృత్తిలో తన ప్రస్థానం గురించి వివరించారు. తనకు, తన కుటుంబానికి ఆశీర్వచనాలు అందించేందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవిత ప్రయాణం కృష్ణా జిల్లాలోని పొన్నవరం అనే మారుమూల గ్రామంలో మొదలైందని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. ‘‘మా ఊరిలో విద్యుత్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం, కనీస వసతులు ఉండేవి కావు.
తొలిసారి నేను మా ఊళ్లో కరెంటును 12 ఏళ్ల వయసులో చూశాను. సరిగ్గా అదే ఏడాది నేను మొదటిసారి ఇంగ్లిష్ ఏబీసీడీలను నేర్చుకున్నాను’’ అని బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడాలనే పాఠాన్ని తనకు గురువులు, తల్లిదండ్రులు నేర్పించారన్నారు. జీవిత అనుభవాలు కూడా తనకు అదే విషయాన్ని నేర్పాయని పేర్కొన్నారు. ‘‘తొలితరం లాయర్ గా నేను కెరీర్ ను ప్రారంభించినప్పుడు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఓపికతో అధిగమించాను. విజయానికి షార్ట్ కట్ లేదని గుర్తించాను. కష్టపడటం ఒక్కటే మార్గమని తెలుసుకున్నాను’’ అని ఎన్వీ రమణ వివరించారు.