రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిష్ఠాత్మకంగా సిద్ధమైన చిత్రం ‘ఆదిపురుష్’. నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న విడుదల చేశారు. అయితే ఈ సినిమాతో తమకెలాంటి సంబంధం లేదని ఓ ప్రముఖ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
ప్రభాస్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా సిద్ధమైన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విడుదల చేసిన టీజర్‌కు మిశ్రమ స్పందనలు లభిస్తోన్న వేళ.. ఈ సినిమాతో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కోసం తాము పనిచేయలేదని స్పష్టం చేసింది. ‘‘వీఎఫ్‌ఎక్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా సంస్థ ‘ఆదిపురుష్’ వర్క్‌లో భాగం కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన సీజీ లేదా ఏ ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్‌ను మేము చేయలేదు’’ అని పేర్కొంది.
‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రమిదే. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా నటి కృతిసనన్ సందడి చేయనున్నారు. రామాయణంలో కీలకపాత్రధారి అయిన రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాముడిగా ప్రభాస్ లుక్, ఆయన చెప్పిన డైలాగ్‌లు అదరహో అనిపించేలా ఉన్నాయని పలువురు మెచ్చుకుంటుంటే.. టీజర్‌లోని విజువల్స్ చూస్తే హాలీవుడ్‌లో విడుదలైన పలు చిత్రాలు గుర్తుకువస్తున్నాయని, వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
టీజర్ విడుదల సమయంలో ఓంరౌత్.. వీఎఫ్‌ఎక్స్ వాలా అనే ఖాతాను ట్యాగ్ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు ఇదే పేజీని ట్యాగ్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇంకాస్త బాగా వర్క్ చేసి ఉండొచ్చు కదా’ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు టీమ్ తాజా ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌కు చెందిన సంస్థనే ఈ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్ వాలా.