హైదరాబాద్‌ వర్సెస్‌ భాగ్యనగర్‌..ఓల్డ్ సిటీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్

-

హైదరాబాద్‌ వర్సెస్‌ భాగ్యనగర్‌, పాత బస్తీ పై సర్జికల్‌ స్ట్రైక్స్‌, పాతబస్తీ వాసులు కరెంట్‌, కొళాయి బిల్లుల బేఖాతర్‌…ఇలా రాజకీయ నాయకుల ఆరోపణలేవైనా చర్చకు సెంటర్ పాయింట్ పాతబస్తీనే… శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న పాతబస్తీ…ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. పాతబస్తీ అంటే నిర్లక్ష్యమా ఓట్‌ బ్యాంక్‌ రాజకీయమా…

నాలుగువందల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర హైదరాబాద్ పాతబస్తీ సొంతం. నగరంలో అడుగుపెట్టే పర్యాటకులు చార్మినార్‌, లాడ్‌ బజార్లు చూడకుండా వెనుతిరగరు అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌ బిర్యానీ ఘుమఘుమలు పాతబస్తీ కీర్తి కిరీటంలో కలికితురాయి. పురానీ హవేలి, సాలార్‌ జంగ్‌ మ్యూజియమ్‌, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్‌ …ఇలా చారిత్రక వారసత్వ సంపద ఇక్కడ అడుగడుగునా పలుకరిస్తుంది. అయితే ఇదంతా నాణానికి ఒక వైపే. ప్రపంచ పటం పై ఈస్థాయి గుర్తింపు ఉన్నా…పాతబస్తీ గల్లీల్లో జీవితం మాత్రం సమస్యలతో సహవాసం చేస్తోంది.

పాతబస్తీలో ముస్లింలు మెజార్టీ సంఖ్యలో ఉంటే హిందువులు మైనార్టీగా ఉంటారు. ఆర్ధికంగా వెనుకబాటుతనం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం మిగిలిన నగరంతో పోల్చితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం 63 శాతం మంది బీపీఎల్‌కు దిగువనే ఉన్నారు. తోపుడు బళ్లు, ఆటోమొబైల్‌ రిపేర్లు, ఆటో డ్రైవర్లు, టైలరింగ్‌ వంటి వృత్తుల పై పాతబస్తీ వాసులు ఎక్కువగా ఆధారపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు. పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తుంటారు. రోజుకు మూడు, నాలుగు వందలు సంపాదిస్తు ఉన్నంతలో జీవితాన్ని నెట్టుకొస్తున్నామంటున్నారు.

రాజకీయ కోణాన్ని ఒకసారి పరిశీలిస్తే… పాతబస్తీ పతంగి పార్టీకి పెట్టని కోట. మూడున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ మజ్లిస్‌ జెండానే ఎగురుతోంది. 1984 నుంచి 2004 వరకు అంటే ఇరవై ఏళ్ళ పాటు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఎమ్‌ఐఎమ్‌ వ్యవస్థాపకుడు సుల్తాన్‌ సలాఉద్దీన్‌ ఒవైసీ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయన వారసులు అసదుద్దీన్‌ ఒవైసీ ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. వరుసగా నాలుగో దఫా అసద్‌ ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే ఒవైసీ కుటుంబం పట్టు.. పాతబస్తీ పై ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్న ఎమ్‌ఐఎమ్‌ ….పాతబస్తీని మాత్రం అదే స్థాయిలో ఉంచేసిందని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. ఓల్డ్‌ సిటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక్క పరిశ్రమను కూడా ఇక్కడి పార్టీ తీసుకురాలేక పోయింది. ఉన్నత విద్యా సంస్థలు ఇక్కడ కరువే. మూఢ విశ్వాసాలతో సామాజిక చైతన్యమూ తక్కువే. ఒక అధ్యయనం ప్రకారం పాతబస్తీలో కేవలం పేదరికం వల్ల 16 శాతం మంది పిల్లలు పాఠశాల ముఖమే చూడలేదు. చారిత్రక చార్మినార్‌ దగ్గర ఫుట్‌ పాత్‌ పై కర్చీఫ్‌లు అమ్ముకుంటున్న …. చిన్నారి పాతబస్తీ పేదరికానికి, వెనుకబాటుతనానికి ఒక నిఖార్సైన ఉదాహరణ. అనారోగ్య కారణాలతో తల్లి, తండ్రీ చనిపోవటంతో ఏడుగురు పిల్లలు రోడ్డున పడ్డారు. పట్టుమని పన్నెండేళ్లు లేవు. అయినా మిగిలిన ఆరుగురు పిల్లల కడుపు నింపాల్సిన బాధ్యత ఈ చిన్నారి మీదే.

పాతబస్తీలో కనిపించే మరో కీలక సమస్య.. మౌలిక సదుపాయాల కొరత. రోడ్ల పై పొంగి పొర్లే డ్రైనేజ్‌లు, అశుభ్ర వాతావరణం ఇక్కడ మామూలే. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలో డ్రైనేజ్‌ పనులు ప్రారంభించి, ఏడాదైనా పూర్తి చేయకుండా వదిలేయటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముక్కుపుటలు అధిరే దుర్గంధం మధ్య బతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

ఇరుకు గల్లీలు, అధ్వాన్నమైన రోడ్లు.. పాతబస్తీలో ప్రతిచోట దర్శనమిస్తాయి. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి ఓట్లు అడుగుతారు. తర్వాత తమ వైపు కన్నెత్తి చూడరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
ఎన్నికల సమయంలో అటు బీజేపీ, ఇటు ఎమ్‌ఐఎమ్‌ కూడా పాతబస్తీ పై చేసిన ఆరోపణ కీలకంగా మారింది. పాతబస్తీ వాసులు కరెంటు, కొళాయి బిల్లులు కట్టరని ఎమ్‌ఐఎమ్‌ అండతో ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోరని బీజేపీ ఆరోపించింది. ప్రత్యర్ధి చేసిన ఈ ఆరోపణను తిప్పి కొట్టాల్సిన ఎమ్‌ఐఎమ్‌ ఈ వాదననే ఘనంగా చెప్పుకుంది. ఎమ్‌ఐఎమ్‌ ఉండటం వల్లే ప్రభుత్వ బిల్లులు కట్టకపోయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగి అడిగే సాహసం చేయరని బహిరంగ సభలో గర్వంగా చెప్పుకొచ్చారు ఎమ్‌ఐఎమ్‌ ఎమ్మెల్యే మౌజ్జం ఖాన్‌.రాజకీయ పార్టీల ప్రయోజనాలు, ఓట్ల సమీకరణాలతోనే పాతబస్తీ అభివృద్ధి నినాదం అడుగంటిపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news