ప్రపంచం ఓమిక్రాన్ ధాటికి అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే 63 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువ వ్యాపించే గుణం ఉండటంతో కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కేసుల సంఖ్య 10 వేలను దాటింది. ప్రస్తుతం అన్ని ఓమిక్రాన్ ప్రభావిత దేశాల్లో కలిపి చూస్తే.. 10,389 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా బ్రిటన్, డెన్మార్క్ దేశాలు ఓమిక్రాన్ ధాటికి హడలిపోతున్నాయి. ఈ దేశాల్లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఓమిక్రాన్ తొలి మరణం కూడా బ్రిటన్ లోనే నమోదైంది. లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి.. ఇప్పటి వరకు ఒక్క మరణం లేదనుకుంటున్న సమయంలో.. తొలి మరణం సంభవించడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. అత్యధికంగా యూకేలో 4713 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా… డెన్మార్క్ లో 2471, నార్వేలో 958, దక్షిణాఫ్రికాలో 779 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ అనుమానితుల సంఖ్య 77996 గాఉంది. వీరిలో కూడా ఓమిక్రాన్ కేసులు బయటపడితే .. మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది.