దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ కొత్త వేరియంట్.. తక్కువ కాలంలోనే వందకు పైగా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యూకే, యూఎస్ఏ దేశాాల్లో కల్లోలం రేపుతోంది. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఓమిక్రాన్ విజృంభిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు అధికారికంగా 422 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే అనధికారికంగా మాత్రం ఈ కేసుల సంఖ్య450ని దాటిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 130 మంది ఓమిక్రాన్ బారి నుంచి రికవరి అయ్యారు. దేశంలో ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య వందను దాటింది. దీంతో పాటు ఢిల్లీలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. తరువాతి స్థానాల్లో గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.
అయితే ఓమిక్రాన్ తో ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారిలో సాధారణ స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఓమిక్రాన్ బారిన పడిన వారు పెద్దగా హాస్పటలైజ్ అయింది కూడా లేదని.. వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే యూకే, యూఎస్ దేశాల్లో మాత్రం ఓమిక్రాన్ వల్ల మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 31 ఓమిక్రాన్ మరణాలు సంభవించాయి. వీటిలో 29 మరణాలు ఒక్క యూకేలోనే సంభవించాయి.