ఓమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్ట్

ఓమిక్రాన్, కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్ట్. తాజాగా ఈ రోజు కోవిడ్ పై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఓమిక్రాన్ పెరుగుతున్న క్రమంలో పలు కీలక సూచనలు చేసింది. న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని… అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వానికి హైకోర్ట్ సూచనలు చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్న క్రమంలో హైకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం హైకోర్ట్ చేసిన ఆదేశాలను, సూచనలను రెండు మూడు రోజుల్లో అమలు చేయాలని సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కోవిడ్ పరీక్షలు చేయడానికి విధివిధానాలు ఖరారు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలపై నిషేధం విధించాయి. అయితే హైకోర్ట్ చేసిన సూచనలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.