ఆల్కహాల్‌ను పరిమితమైన మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయాన్నే సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం ఒకటి లేదా రెండు డ్రింక్స్ చొప్పున వారానికి 14 డ్రింక్స్‌కు మించకుండా ఆల్కహాల్ సేవిస్తే.. దాంతో వృద్ధాప్యంలో మెదడు పరంగా వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవచ్చని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.
పరిమిత మోతాదులో ఆల్కహాల్ సేవించడం వల్ల మెదడు వృద్ధాప్యంలోనూ చురుగ్గా పనిచేస్తుందని సైంటిస్టులు అంటున్నారు. అందుకుగాను వారు 19,887 మందిని 9.1 ఏళ్ల పాటు పరిశీలించారు. వారికి ఉన్న ఆహారపు అలవాట్లు, మద్యం తాగే మోతాదు, వారికి ఉన్న అనారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి రికార్డు చేశారు. దీంతో వెల్లడైందేమిటంటే.. అసలు మద్యం తాగని వారితో పోలిస్తే.. తక్కువ నుంచి ఒక మోస్తరు స్థాయిలో మద్యం సేవించిన వారిలో వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని గుర్తించారు. వారు అనేక విషయాలను గుర్తు పెట్టుకోవడమే కాదు, పలు యాక్టివిటీలలో చురుగ్గా పాల్గొంటున్నారని, మెదడు సంబంధ సమస్యలు తక్కువగా వచ్చాయని గుర్తించారు. ఈ మేరకు సైంటిస్టులు తమ అధ్యయన వివరాలను జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించారు.
యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన పరిశోధక విద్యార్థులు పైన తెలిపిన అంశం మీద అధ్యయనాలు చేసి ఈ విషయాన్ని తేల్చారు. అయితే ఇలా అంటున్నామని చెప్పి.. ఎవరూ మద్యానికి బానిసలు కాకూడదని, ఆల్కహాల్‌ను పరిమిత మోతాదులో సేవిస్తేనే పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయని.. అంతేకానీ.. నిత్యం విపరీతంగా మద్యం సేవించే వారికి అనారోగ్య సమస్యలే ఎక్కువగా వస్తాయని వారంటున్నారు. అవును మరి.. ఆల్కహాల్ సేవించడం మంచిదే. కానీ అది మోతాదుకు మించకుండా ఉంటేనే మనకు ఆరోగ్యాన్నిస్తుంది. అదే మోతాదుకు మించితే అదే మనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది.