ప్రధాని మోదీని కేవలం రాహుల్ గాంధీ మాత్రమే భయపెట్టగలరని అస్సాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా అన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. మోదీని భయపెట్ట గల సామర్థ్యం కేవలం రాహుల్ గాంధీకే ఉందని, అందువల్ల సోనియా గాంధీ రాహుల్‌కు పార్టీ బాధ్యతలను అప్పగించాలని ఆమెను కోరానని బోరా తెలిపారు.
కాగా అనారోగ్య కారణాల వల్ల ఇకపై కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా తాను పనిచేయలేనని ఇప్పటికే సోనియా గాంధీ తెలిపారు. మరోవైపు ఏడాదిగా పార్టీకి నాయకుడు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 23 మంది సీనియర్ నాయకులు సోనియాకు లేఖ రాశారు. దీంతో సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. అందులో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని తిరిగి ఎన్నుకుంటారని తెలుస్తోంది.
In an earlier video conference meeting with Congress president Sonia Gandhi & Rajya Sabha MPs, I categorically appealed to Sonia Gandhi to give the leadership of Congress party to Rahul Gandhi as Narendra Modi is scared of Rahul Gandhi only: Assam Congress President Ripun Bora pic.twitter.com/wneTs95gv8
— ANI (@ANI) August 23, 2020
కాగా 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం రాహుల్ అదే ఏడాది జూలైలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎంత మంది చెప్పినా ఆయన మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టేందుకు ససేమిరా అన్నారు. దీంతో 2019 ఆగస్టులో సోనియా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి బలమైన నాయకుడు అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకనే సోమవారం సీడబ్ల్యూసీ సమావేశమై ఇదే అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
కాగా సోనియా గాంధీ 1998 నుంచి 2017 వరకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. దీంతో ఆ పార్టీకి అత్యంత సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. 2017లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనా.. 2019 ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గత ఏడాది నుంచి సరైన నాయకత్వం లేక కొట్టుమిట్టాడుతోంది. అయితే కొందరు నాయకులు సోనియానే అధ్యక్షురాలిగా ఉండాలని అంటుండగా.. మరికొందరు రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి సోమవారం జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఏమవుతుందో చూడాలి.