సినిమాలకు ఓటీటీ… రాజకీయాలకు టీటీటీ!

-

కరోనా సమయంలో సినిమాల విడుదలకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం ఓటీటీ అనుకుంటున్న దశలో… ఇదే కరోనా సమయంలో రాజకీయాలకు కూడా అలాంటి ఫ్లాట్ ఫాం ఒకటి ఉంది.. అదే టీటీటీ! అవును… అదే “టీడీపీ ట్విట్టర్ టాక్స్”! అవును… ఇష్యూ ఎంత పెద్దదైనా, మరెంత ప్రాముఖ్యమైనది అయినా… బాబు స్పందన ట్విట్టర్ లోనే! పుట్టినరోజు శుభాకాంక్షలకో, వర్ధంతి నివాళులకో.. ఆన్ లైన్ లో స్పందిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. ప్రతీ విషయానికీ ట్విట్టర్ నే నమ్ముకుంటే ఎలా అనేది తమ్ముళ్ల ప్రశ్న!

కరోనా సమయంలో బాబు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు అంటే.. 70ఏళ్ల వయసుకదా రిస్క్ ఎందుకనుకున్నారు అని సరిపెట్టుకున్నారు తమ్ముళ్లు. మరి లోకేష్ కి ఏమైంది అంటే… చిన్నపిల్లోడు ఇంట్లో ఉన్నాడు కదా అందుకని చక్కబెట్టే మాటలతో సర్ధుకున్నారు అభిమానులు. కానీ.. లాక్ డౌన్ కి ఎన్ని సడలింపులు చేసినా.. వీరు మాత్రం ఆ సడలింపులను అర్ధం చేసుకుని అయినా జనాల్లోకి రావడం లేదు. కేవలం ఇప్పటికీ ట్విట్టర్ రాజకీయాలే చేస్తున్నారు.

అసలు ఈ ట్విట్టర్ రాజకీయాలు నారా లోకేష్ చేసేవారు. జనాల్లోకి వస్తే ఏది మాట్లాడితే ఏమవుతాదో అని.. ఆయనకు తెలుగు బాషపైనా, సమకాలీన రాజకీయాలపైనా ఉన్న పట్టు సంగతి జనాలకు తెలిసిపోతుందని.. ఒకటికి రెండు సార్లు చూసుకుని ట్విట్టర్ లో పొలిటికల్ పోస్టులు పెట్టేవారు. సరే లోకేష్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా భావ్యం కాదని టీడీపీ నేతలూ, కార్యకర్తలూ సర్ధుకున్న సమయంలో… ఇదేదో బాగున్నట్లుందనుకున్నారో ఏమో కానీ చంద్రబాబు కూడా ఆన్ లైన్ పాలిటిక్స్ కే ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. పార్టీని నడపాలనే ఉద్దేశ్యం ఉన్న నాయకులు చేసే పనేనా ఇది అని వస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… అసలు బాబు ఇలా ఎందుకు మారిపోయారనేది తమ్ముళ్లకు డాలర్ ప్రశ్న!

కరోనా దెబ్బతో హైదరబాద్ లోని ఇంటికే పరిమితమైన చంద్రబాబు జూమ్ రాజకీయాలకు తెరతీశారు. సాయంత్రం కాగానే జూమ్ లోకి రావడం, ప్రభుత్వంపై నాలుగు విమర్శలు చేయడం, కరోనాపై రెండు విషయాలు చెప్పడం.. అనంతరం అదృశ్యమైపోవడం చేసేవారు. అనంతరం ఒకానొక శుభముహూర్తాన్న ఏపీలో అడుగుపెట్టారు. హమ్మయ్య… అని ఆనందపడిన తమ్ముళ్లు “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ సంబరాలు చేసుకున్నారు. కానీ.. వారి ఆనందాలు ఆన్ లైన్ మహానాడు అనంతరం ఆవిరైపోతాయని వారు ఊహించలేదు. ఆన్ లైన్ మహానాడు అవ్వగానే మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు చంద్రబాబు. అనంతరం మళ్లీ ట్విట్టర్ కే పరిమితమైపోయారు.

లాక్ డౌన్ పేరుతో ఇన్నాళ్లూ హైదరాబాద్ లో లాక్ అయిపోయిన చంద్రబాబు.. అన్ లాక్ వేళ కూడా ప్రజల్లో లేకుండా ట్విట్టర్ లో రాజకీయాలు చేసుకుంటున్నారు. కొడుకుని చక్కదిద్దుకుని, రాజకీయాలకు సూటయ్యేలా సక్రమమైన మార్గంలో పెట్టుకుని, ట్రైనింగ్ ఇచ్చి పార్టీని ఉద్దరించేలా, తనను మించిపోయేలా తయారుచేస్తారని అనుకుంటే… చంద్రబాబే తిరిగి లోకేష్ లాగా మారిపోయారని, ట్విట్టర్ కే పరిమితమైపోయారని తమ్ముళ్లు ఆవేదన చెందుతూ, ఫైరవుతున్నారంట!

Read more RELATED
Recommended to you

Latest news