శివసేన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. దీంతో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు తమ ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తమ పార్టీ నేతలు ఐక్యంగానే ఉన్నారని, తమ ఎమ్మెల్యేలు అమ్మకానికి లేరని పేర్కొన్నారు. తాము బీజేపీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని రెబల్ శివసేన ఎమ్మెల్యేలు ప్రకటిస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేసింది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వేళ.. అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఏఐసీసీ పరిశీలకుడిగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ అధిష్టానం అక్కడికి పంపించింది. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కమల్‌నాథ్ సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం కరోనా బారిన పడటంతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యతతో ఉన్నారని, తమ ఎమ్మెల్యేలు నాట్ ఫర్ సేల్ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు.