మద్యం మత్తులో చపాతీల కోసం దౌర్జన్యం.. లారీతో తొక్కించిన డ్రైవర్

-

చెన్నై లోని రెడ్ హిల్ సమీపంలోని వడపెరుంబాక్కం ప్రాంతంలో లారీ పార్కింగ్ యార్డులు ఉన్నాయి. ఇందులో ఒక యార్డును రెడ్ హిల్స్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన కమల్ అలియాస్ కమలకన్నన్(36), కుమరన్ (34) నవీన్ అనే ముగ్గురు యువకులు ఆ యార్డు వద్ద ఫుల్లుగా మద్యం తాగారు. ఆ తర్వాత యార్డులో ఆగి ఉన్న ఓ లారీ వద్దకు వెళ్ళి దాని డ్రైవర్ కళ్యాణ్ సింగ్, క్లీనర్ గిరీష్ కుమార్ తో గొడవ పడ్డారు.

వారు తయారు చేసుకుంటున్న చపాతీలను తమకు ఇవ్వాలంటూ దౌర్జన్యానికి దిగారు. చపాతీలు కావాలంటే ఇస్తాను గాని, దౌర్జన్యం చేస్తే కుదరదని డ్రైవర్ కళ్యాణ్ సింగ్ చెప్పాడు. ఈ వ్యవహారం కాస్త గొడవకు దారితీసింది. దాంతో కమల్ బృందం ఆ డ్రైవర్, క్లీనర్ పై దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ యార్డ్ లో ఉన్న ఓ లారీని రివర్స్ లో నడుపుతూ ఆ ముగ్గురిని ఢీకొట్టాడు. లారీ చక్రాల కింద పడి కమల్, కుమరన్ అక్కడికక్కడే మరణించగా.. నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆ యార్డులో ఉన్న ఐదు లారీల పై రాళ్లతో దాడి జరిపారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న డిసిపి మహేష్, అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు మురుగేషన్, దక్షిణామూర్తి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. రెడ్ హిల్స్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు. ఇదిలా ఉండగా హత్యకు గురైన కమల్, కుమరన్ స్నేహితులు వారిద్దరూ కార్లను అద్దెకిచ్చే ట్రావెల్స్ సంస్థ నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే దీనికి బాధ్యులైన డ్రైవర్, క్లీనర్ లను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news