హుజూరాబాద్ ఉప ఎన్నిక. అదో హాట్ టాపిక్. ఈ ఎన్నిక కొంత మందికి మోదం మిగిలిస్తే ఒక్కరికి మాత్రం ఖేదమే మిగిల్చింది. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికల్లో గెలవాలనే భావనతో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కాయి. ఇంతరవకు బాగానే ఉన్నా ఒక్కరికి మాత్రం పదవి దక్కినట్లే దక్కింది. కానీ, చేతికి అందలేదు. దక్కుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆయనే పాడి కౌశిక్‌రెడ్డి.
గత శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పాడి కౌశిక్‌రెడ్డి పోటీ చేశారు. 63 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఓడిపోయినా పాడి కౌశిక్‌రెడ్డికి గౌరవప్రద స్థానమే దక్కింది. ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం, మంత్రి పదవి నుంచి భర్తరఫ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చకచకా జరిగిపోయాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పాడి కౌశిక్‌రెడ్డి తెరపైకి వచ్చారు. ఆశ్చర్యకరంగా టీఆర్‌ఎస్ నేతల కంటే ఘాటుగా ఈటలపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. చివరికి గులాబీ కండువా కప్పుకున్నారు. ఎలాగైనా ఈటల రాజేందర్‌ను ఓడించాలని భావించిన పార్టీ అధినేత కే చంద్రశేఖర్ గవర్నర్ కోటాలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. గతంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కావడం, టీఆర్‌ఎస్ టికెట్ ఆశించే అవకాశం ఉండటంతో ఆయన చేరికతో ఎంతో కొంత లాభం చేకూరుతుందని వారాల వ్యవధిలోనే ‘పాడి’కి అందలం ఎక్కించేందుకు ప్రయత్నించారు.
కానీ, డామిట్ కథ అడ్డం తిరిగింది. గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కౌశిక్‌రెడ్డి సిఫారసును పెండింగ్‌లో పెట్టారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు చందాన అన్నట్లుగా మారింది పరిస్థితి. చివరికి హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికా పూర్తయింది. ఈటల రాజేందర్ గెలవడం, టీఆర్‌ఎస్ ఓడటం కూడా పూర్తయింది. కానీ, కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి మాత్రం దక్కలేదు. దక్కుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదనే నానుడి టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగినట్లయితే ఆ పార్టీ టికెట్ దక్కేది. ఆ పార్టీలో గౌరవమూ లభించేది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవిని వదలుకుని మరీ టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థిత్వాన్ని వదలుకున్నారు. కానీ, ఎమ్మెల్సీ పదవి మాత్రం పొందలేకపోయారు.
పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేసిన ‘గవర్నర్ కోటా’నే అసలు సమస్య. ఇదే గవర్నర్ తమళిసై సౌందరరాజన్ అంసంతృప్తికి కారణంగా తెలుస్తున్నది. సాధారణంగా సమాజ సేవ, విద్యారంగం, కళలు, క్రీడలు, ఇతర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తుంటారు. పాడి కౌశిక్‌రెడ్డి ఫక్తు రాజకీయ నాయకుడు. ఈ నేపథ్యంలోనే ఆయన నియామకానికి ఆమోదం పడలేదు. ఇంతవరకు రాజ్ భవన్ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పందన రాలేదు. ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పెండింగ్‌లో పెట్టేశారు.