పాకిస్తాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. తాజాగా ఉత్తర వజిరిస్తాన్ లోని మిరాన్ షా పట్టణంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. పలువురు ఆర్మీ అధికారులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 4-11 ఏళ్లలోపు ఉన్న ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం పాకిస్తాన్ లో ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉంది. ఘటనకు ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే ఉత్తర వజీరిస్తాన్ పాక్ తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చే ప్రాంతంగా ఉంది.
ఇదిలా ఉంటే ఈ దాడిని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఖండించారు. పిల్లలను చంపడం మానవత్వం, ఇస్లాం పరంగా తీవ్రమైన తప్పు అని… ఇందకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ప్రజలు, సైన్యం రక్తం కళ్లచూసిన వారికి తప్పకుండా గుణపాఠం చెబుతాం అని హెచ్చరించారు. మరోవైపు పాకిస్తాన్ సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబు.. ఉగ్రవాదులు పాక్ ను అస్థిరపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.