పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన లో భాగంగా సరైన భద్రత కల్పించకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం చెలరేగుతోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్ట్ కు కూడా చేరింది. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో పలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన మోదీని దాదాపు 20 నిమిషాల పాటు ఆందోళనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది.
తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దురదృష్టకరమని ఆయన వ్యాక్యానించాడు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికి ఉంటుందని అయితే.. ప్రధాని లాంటి వ్యక్తికి ఇబ్బందులు కలిగేలా చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రోటోకాల్స్ తూచా తప్పకపాటించాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అని అన్నారు. క్లిష్ట సమయంలో మోదీ సంయమనం పాటించారని అందుకు అభినందలు తెలిపారు.
ప్రధాన మంత్రి భద్రతా లోపంపై ఈరోజు సుప్రీం కోర్ట్ కూడా కీలక ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, పంజాబ్ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అన్ని ఏజెన్సీలు సహకరించాలని సూచించింది.