జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మాల మహానాడు, దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు కలిసారు. సబ్ ప్లాన్ నిధులను మళ్లిస్తున్నారని పవన్ దృష్టికి బడుగు సంఘాల నేతలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దళిత, ఆదివాసీలు ఈ పాలకులకు ఓటు బ్యాంకు మాత్రమే అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధ్యయనం చేస్తామని, దళిత, ఆదివాసీలను పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 29 పథకాలు రద్దు చేసిందని, దేశం మొత్తం అమల్లో ఉన్న సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర అవసరాలకు ఎలా వాడుకుంటారు..? అని ఆయన ప్రశ్నించారు. దళిత ఆదివాసీల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.