అతి చేయలేదు.. అతిగా మాట్లాడలేదు.ఇద్దరు హీరోలు ఉన్నారు కనుక మనిషికో డ్యూయెట్టు ఇవ్వనూ లేదు.ప్రత్యర్థితో తలపడే పద్ధతి మాత్రమే సినిమాకు హైలెట్. ఆ విధంగా పవన్ సినిమాకు హైలెట్. ఆ విధంగా పవన్ ను ఢీ కొనడంలో రానా యాక్టింగ్ హైలెట్. భీమ్లా నాయక్ మోత మోగిస్తున్నాడు. అనుకున్న దాని కన్నా రెండు రెట్లు మంచి ఫలితాలే అందుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నాడు డైరెక్టర్.
ముఖ్యంగా పవన్ ఖాకీ చొక్కా వేసి, చెప్పిన డైలాగులు, చూపించిన పొగరు అన్నీ కూడా బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్లూ బాగున్నారు. ఇలా చెప్పడం కన్నా పాత్ర పరిధి తెలిసి తెరపై వెలిగారు అని చెప్పడమే సబబు అయిన మాట.ఈ క్రమంలో ఈ సినిమా మంచి ఫలితాలను రాబట్టింది. అన్ని సెంటర్లలోనూ మంచి కలెక్షన్లూ రాబట్టింది.
నాయక్ నీ ఫ్యాన్స్ వెయింట్ ఇక్కడ.. అంటూ డేనియల్ శేఖర్ (రానా) చెప్పిన డైలాగ్ ఇప్పుడు ప్రతి చోటా మారుమ్రోగిపోతోంది. సినిమా అన్ని చోట్ల కలెక్షన్ల మోత మోగిస్తోంది. అనూహ్య రీతిలో ఈ సినిమా విషయమై రాజకీయం చేయాలనుకున్నా కూడా వైసీపీ నెగ్గలేకపోయింది. కొన్ని చోట్ల థియేటర్ల పై దాడులు కొనసాగించి కొంతలో కొంత సినిమా ప్రదర్శన నిలుపుదలకు బాగానే కృషి చేసింది.అయినా కూడా ఫ్యాన్స్ పట్టుదల కారణంగా వైసీపీ సర్కారు అనుకున్న విధంగా అనుకున్న ఫలితాలు అందుకోలేకపోయింది.
పవన్ సినిమా భీమ్లా నాయక్ మానియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలయింది. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి పండగ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో కొన్నిచోట్ల ఏపీ సర్కారు తీసుకున్న చర్యల కారణంగా వివాదాలు తలెత్తినా, సినిమా ఫలితం చాలా బాగుండడంతో సర్కారు కూడా పునరాలోచనలో పడింది. దీంతో వైసీపీ వర్గాలు కూడా సినిమా కు సంబంధించి నెగెటివ్ ప్రచారం చేయాలన్న ఆలోచనను కూడా మానుకున్నారు. ఓ దశలో వైసీపీ నాయకులే సినిమాను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు కూడా!