తనను అరెస్ట్ చేసుకోవచ్చని..చిత్రవధ చేసుకోవచ్చని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేశారు. వైసీపీ కి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో కేసులు పెట్టారు… పవన్ ను విచారించాలని జీవో ఇచ్చారని.. . అరెస్ట్ చేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను పార్టీ ఎందుకు పెడతాననిప్రకటించారు. తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జగన్ సై అంటే తాను సై అన్నారు.
ఇదిగో ఆ జీవో అంటూ కొన్ని పత్రాలను పవన్ ప్రదర్శించారు. “ఇప్పుడు నా అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్టు అర్థమైంది. ఈ ఒక్క సంఘటనే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అవుతుంది. నేను ఒక మాట చెప్పానంటే ఇక ఎలాంటి రిస్కులకైనా వెనుదీయను. ఓకే జగన్… చెబుతున్నాను కదా… సై అంటే సై… రెడీగా ఉన్నాను… రా… చూసుకుందాం! జగన్ గుర్తుపెట్టుకో… యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, వారికి రోజుకు 164 రూపాయల 33 పైసలతో వారిని వాలంటీర్లుగా కొనేశావు. యువతను నువ్వు ఇలా మోసం చేసినందుకు జనసేన పార్టీ కచ్చితంగా తిరగబడుతుంది. జనసేన పార్టీ యువతకు, వాలంటీర్లకు అండగా ఉంటుంది” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.