ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేనానికి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.
రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.