పవన్ కల్యాణ్‌ని కలుపుకోకపోతే..ఖచ్చితంగా టీడీపీకి నెక్స్ట్ ఎన్నికల్లో చిక్కులు తప్పవని విశ్లేషణలు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే జనసేన వల్ల టీడీపీకి చాలా నష్టం జరిగింది. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీ ఓటమి పాలైంది..అలాగే వైసీపీ అదిరిపోయే విజయాలు అందుకుంది. ఇక ఇదే సీన్ నెక్స్ట్ ఎన్నికల్లో రిపీట్ అయితే..మళ్ళీ వైసీపీదే అధికారమని ప్రచారం నడుస్తోంది.
దీంతో పవన్‌ని కలుపుకోవాలని చంద్రబాబు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు జనసేన కూడా సత్తా చాటాలంటే టీడీపీతో పొత్తు తప్పనిసరి. లేదంటే రెండు పార్టీలకు భారీగా నష్టం జరిగేలా ఉంది. ముఖ్యంగా టీడీపీకి పెద్ద దెబ్బ. అలా జనసేన వల్ల టీడీపీకి భారీ నష్టం జరిగే జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒకటి. గత ఎన్నికల్లోనే ఇక్కడ జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీ కేవలం 2 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది.
ఈ సారి కూడా విడిగా పోటీ చేస్తే టీడీపీకే దెబ్బ..పశ్చిమ గోదావరిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. 15 సీట్లకు గాని 10 సీట్లలో జనసేన గెలుపోటములని ప్రభావితం చేయగలదని తాజా సర్వేల్లో వెల్లడవుతుంది. పాలకొల్లు, భీమవరం,తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు, ఏలూరు, ఆచంట, ఉంగుటూరు, నిడదవోలు, ఉండి, కొవ్వూరు స్థానాల్లో జనసేన ప్రభావం ఉందని తేలింది.
ఇక వీటిల్లో నరసాపురం, భీమవరం స్థానాల్లో వైసీపీ-జనసేనల మధ్య పోటీ ఉంది. ఈ రెండు చోట్ల టీడీపీ మూడో స్థానంలో ఉంది. అలాగే మిగిలిన 8 స్థానాల్లో వైసీపీ-టీడీపీల మధ్య పోటీ ఉంది. వీటిల్లో టీడీపీకి కొన్ని సీట్లు ఎడ్జ్ ఉంది. కానీ అన్నీ సీట్లు ఖచ్చితంగా గెలవాలంటే జనసేనతో మాత్రం పొత్తు ఉండాల్సిందే అని తెలుస్తోంది. లేదంటే పశ్చిమలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.