వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పంచాయతీ రాజ్ సంస్థలు గత కొంత కాలంగా నిర్వీర్యం అవుతూ ఉన్నాయని, కేరళలో స్థానిక సంస్థలు ఎలా ఉంటాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 80 శాతం మంది సర్పంచులు అధికార పక్షం వాళ్లే ఉంటారని, అలాంటి సర్పంచులే నిధుల కోసం రోడ్డెక్కిన పరిస్థితి ఏపీలో ఉందన్నారు పవన్. కేంద్రం ఇచ్చే నిధుల్లో ఎలాంటి కోతల్లేకుండా గ్రామ పంచాయతాలకే దక్కేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గ్రామ పంచాయతీల నిధులను దోచేస్తున్నారని, పంచాయతీ రాజ్ వ్యవస్థల బలోపేతం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. ‘గ్రామ సభలకు ప్రాధాన్యత కల్పించేలా చైతన్యం తెస్తాం. గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలకు భాగస్వామ్యం ఉండాలి. చెక్ పవర్ సర్పంచులకే ఉండేలా చూస్తాం. ఏపీలో స్థానిక సంస్థల సమస్యలు.. స్థానిక ప్రజా ప్రతినిధుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. గ్రామ సర్పంచులు అప్పులు పాలవుతున్నారు.. అధికారాలు కొల్పోతున్నారు.. అవమానాలకు గురవుతున్నారు. పంచాయతీ రాజ్ బలోపేతంపై మేనిఫెస్టోలో పెడతాం. గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు వచ్చే వ్యవస్థ ఏర్పాటుపై మేనిఫెస్టోలో పెడతాం. గ్రామ సమస్యల విషయానికి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏపీలో కేంద్ర నిధుల దుర్వునియోగం విపరీతంగా జరుగుతోంది. కేంద్ర నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికే ప్రత్యేక అకౌంట్లు తెరవమని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీలో కేంద్ర నిధులను దోచేస్తున్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు సమాంతర వ్యవస్థ దేనికి..? పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేసేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి కానీ.. నిర్వీర్యం చేస్తారా..? పంచాయతీల్లో ఏకగ్రీవానికి జనసేన వ్యతిరేకం. పంచాయతీల్లో ఏకగ్రీవం చేయకుండా ఉండేలా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ వలంటీర్ల వ్యవస్థపై జనసేన ఆలోచన చేస్తోంది.’ అని పవన్ అన్నారు.