తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మీ అభిమానం, ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదు, నేను పూజించే ఆ తల్లి ఇచ్చింది. యాగం ముఖ్య ఉద్దేశం ధర్మ పరివర్తన. గతంలో నేను మాట్లాడిన మాటలు వింటుంటే నేనేనా మాట్లాడింది అనిపించింది. పదేళ్లు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా పార్టీ నడపడం మాములు విషయం కాదు. నేను గొడవ పెట్టకుంటున్న వ్యక్తులు వేల కోట్లు సంపాదించిన వారు. నన్ను పాలించేవాడు నా కంటే నీతి మంతుడు అయ్యి ఉండాలి. నా కోసం రాజకీయాలలోకి రాలేదు.. మీ భవిషత్తు కోసం వచ్చాను. నన్ను పాలించే వారికి నేను గులాం గురి చేయను. పొట్టి శ్రీరాములు బలిదానం వలన ఏపీ ఏర్పడింది. ఆంధ్రకు ముఖ్యమంత్రులు పొట్టి శ్రీ రాములుకి మోకారిల్లాలి. మన నాయకులు ఆయనను తు తు మంత్రంగా గుర్తు చేసుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ నుంచే జనసేన రాజకీయం మొదలవుతుందని వెల్లడించారు పవన్ కళ్యాణ్. పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కొంత మంది నాయకులు తనపై కక్ష్యగట్టారని తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేశారని చెప్పారు. నాకు చెగువేరా స్ఫూర్తి అని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ గర్జించారు. భారీ ఎత్తున జరిగిన ఈ సభలో పెద్ద సంఖ్యలో అభిమానులు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.