జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆయన మమమల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కల్యాణ్. అంతేకాకుండా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. సైదులు భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవలే సైదులు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చౌటుప్పల్ నుంచి లక్కారం వరకు పవన్ కల్యాణ్ ర్యాలీగా వెళ్లారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా… జనసేనానికి పట్టణంలో జనసేన కార్యకర్తలు… పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్. తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు జనసేనాని. ప్రతి నియోజకవర్గంలో 5 వేలకుపైగా ఓట్లున్నాయని, తెలంగాణలోనూ రాజకీయాలను జనసేన శాసిస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ కూడా తమ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని వెల్లడించారు. ఏపీలో ఎన్నికల పొత్తుపై సమాధానం దాటవేసిన పవన్ కల్యాణ్.. శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించడానికి కోదాడకు బయలుదేరారు. జనసేన కార్యకర్తలకు వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, రోడ్డు ప్రమాదంలో మరణించిన సైదులు, శ్రీనివాస్ కుటుంబాలకు జనసేన ఎప్పుడు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.