విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే కడప రిమ్స్ లో పసికందుల మరణాలు జరిగాయని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. ఒక మానిటర్ తోనే 30మంది పిల్లలకు వైద్య సేవలు చేశారని చెబుతున్న తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని.. ఇటువంటి తీవ్ర ఘటన జరిగినప్పుడు తక్షణం తనిఖీలు చేసి విచారణ చేయాల్సిన జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఆసుపత్రి అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఈ ఘటనపై వివరాలు కోరిన మీడియాను ఎందుకు ఆసుపత్రిలోకి రానీయడం లేదు? బిడ్డల మరణంతో ఆందోళనలో ఉన్న తల్లితండ్రులను పోలీసులను పిలిపించి మరీ ఎందుకు తరలించారు? అని నిలదీశారు. ఆరోగ్య సమస్యలతో ఉన్న మరో 30 మంది పిల్లల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదని.. ఉన్న వైద్య ఉపకరణాలను వినియోగించరని నిప్పులు చెరిగారు.
ప్రభుత్వంలోని పెద్దలకు మానవీయ కోణం లోపించడమే వైద్య రంగంలో ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతోందని.. పాలకపక్షం తప్పులు, దూరదృష్టి లేమి కారణంగా అభంశుభం ఎరుగని పసికందులకు నూరేళ్లు నిండాయన్నారు. మండిపోతున్న ఎండల కారణంగా విద్యుత్ వాడకం పెరగడంతో కోతలు విధిస్తున్నామని పాలకులు చెప్పడం వారి చేతకానితనానికి నిదర్శనమని.. ఎండలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మండిపోతున్నాయా? అని ఆగ్రహించారు. పక్కనున్న తెలంగాణ, తమిళనాడులలో లేవా? మరి అక్కడ విద్యుత్ కోతలు ఎందుకు లేవు?ఇకనైనా ప్రభుత్వంలోని పెద్దలు కళ్ళు తెరిచి ఆస్పత్రులలో జనరేటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.