అందివచ్చిన సమయంలో మించిపోతే.. ఎవరికైనా ఇబ్బందే. అది రాజకీయమైనా.. మరేదైనా కూడా! ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. జనసేన విషయంలోనూ సమయం మించి పోతోందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా పార్టీ ఎదగాలి.. అంటే.. క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు బలం గా ఉండాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ బలపడాలి. ఈ వ్యూహంతోనే ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే వైసీపీని బలంగా ముందుకు తీసుకువెళ్లారు జగన్. మరి ఈ వ్యూహం.. జనసేనలో ఎక్కడా కనిపించడం లేదు. గడిచిన ఎన్నికలకు ఆరు మాసాల ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పిన పవన్.. కొన్ని జిల్లాల్లో పర్యటించారు.
యువత ఓట్లు తనకే నని అనుకున్నారు. కానీ, తర్వాత ఎన్నికల ఫలితాల్లో డింకీలు తిన్నారు. ఇక, ఆ తర్వాత పార్టీ ఉండాలంటే.. డబ్బులు ఉండాలి. నేను ఇల్లు గడుపుకోవాలన్నా డబ్బులు కావాలి.. అనే సెంటిమెంటు డైలాగులు పేల్చి సినిమా దారిపట్టారు. ఇక, ఆ తర్వాత ఏపీలో అడుగు పెట్టింది కూడాలేదు. పోనీ.. కీలక సందర్భాల్లో అయినా స్పందిస్తున్నారా? అంటే అది కూడా లేదు. ప్రస్తుతం రాజకీయంగా వినియోగించుకునేందుకు రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. ఏకంగా సీఎం కేంద్రంగా టీడీపీ చక్రం తిప్పుతోంది. ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. ఆయన న్యాయవ్యవస్థపైచేసిన కామెంట్లు, ఉత్తరాలను రాజకీయంగా వాడుకుని ప్రజల్లోకి వెళ్లింది.
ఇక, వర్షాలు, వరదలతో అట్టుడుకుతున్న ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా తన కుమారుడు లోకేష్‌ను రంగంలోకి దింపారు. ఆయన రైతులను పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకత అంటూ విమర్శలు సైతం సంధిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో అయినా పవన్ పట్టించుకుని ముందుకు రావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.
పోనీ.. ఆయన రాలేక పోయినా.. ఆయన తర్వాత నేతలనైనా రంగంలోకి దింపాలిగా? అది కూడా కనిపించడం లేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, పవన్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందనే ప్రశ్నలు తప్ప సమాధానాలు కనిపించడం లేదు.