టీడీపీ కొమ్ము కాయడానికి లేదు..మూడో ప్రత్యామ్నాయం కావాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం అవసరమని.. వైఎస్ కుటుంబ కోవర్టుల వల్లే ప్రజారాజ్యం పతనం అన్నారు. 2014లో మోడీ అడిగితేనే తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం ఆపేందుకు శత్రువులతో అయినా కలవాలన్నారు.
జనసేన పార్టీ ఎప్పుడూ వైసీపీకో , టీడీపీ కొమ్ము కాయడానికో లేదని.. మేం మార్పు కోసం బలమైన రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు. కచ్చితంగా మార్పు వచ్చే వరకు నిలబడి పోరాడుతామని.. బరిలో నిలుస్తామే తప్ప పారిపోయేది లేదని వివరించారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చాలామంది భావించారని… ఎందరో వెనుకబడిన వర్గాల వారు, మేధావులు, అభ్యుదయవాదులు మార్పు కోసం ముందుకు వచ్చారని తెలిపారు. ఆ రోజుల్లో కొందరు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబ కోవర్టులు వల్ల పార్టీ నిలబెట్టుకోలేకపోయామని.. తర్వాత వారందరికీ విధేయతకు మెచ్చి మంచి మంచి పదవులు లభించాయని వివరించారు. ప్రజారాజ్యం విలీనం తర్వాత.. ఒక బలమైన మార్పు తీసుకువచ్చే వరకు పోరాడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.