కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కులను ధరిస్తున్నారు. నోరు, ముక్కులను కప్పి ఉంచేలా మాస్కులను ధరించడం అలవాటు చేసుకుంటున్నారు. డబుల్ మ్యుటంట్ కేసులు నమోదు అవుతున్నందున డబుల్ మాస్క్‌లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు దాదాపుగా భారీగా తగ్గిపోవడం, టీకాలను ఎక్కువగా వేస్తుండడంతో.. ఆయా దేశాల్లో మాస్కులను ధరించకపోయినా ఫర్వాలేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా దేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదు. మరి ఆ దేశాలు ఏమిటంటే..
1. ఫేస్ మాస్క్ లకు వీడ్కోలు పలికిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో జనాభాలో 70 శాతానికి పైగా కోవిడ్ టీకాలు వేశారు. ఏప్రిల్ 24 నుండి ఆ దేశంలో అదృష్టవశాత్తూ కొత్త కేసులు నమోదు కావడం లేదు. దీంతో అక్కడ మాస్కులను ధరించాల్సిన పనిలేదని చెప్పారు. ఇజ్రాయెల్‌లో 8,39,000 కేసులు నమోదు కాగా, 6,392 మంది చనిపోయారు.
2. కోవిడ్ మహమ్మారి సృష్టించిన వినాశనంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారీగా నష్టపోయింది. అయితే ఆ దేశం చాలా మందికి టీకాలు వేసింది. ఆ కారణంగా ఫేస్ మాస్క్ నియమాన్ని తొలగించారు. అక్కడ కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారు మాస్కులను ధరించాల్సిన పనిలేదని చెప్పారు. యూఎస్ఏలో ఇప్పటివరకు 34,043,066 కేసులు నమోదు కాగా 609,544 కోవిడ్ మరణాలు సంభవించాయి.
3. న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ కోవిడ్ పరిస్థితిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రపంచ నాయకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ దేశంలో 2,658 కేసులు నమోదు కాగా 26 మరణాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. అక్కడ మాస్కు ధరించడం తప్పనిసరి కాదు.
4. చైనాలో కోవిడ్ మొదటి కేసు 2019 డిసెంబర్లో నమోదైంది. అయినప్పటికీ అక్కడ దాదాపుగా ప్రతి ఒక్కరికీ టీకాలు వేశారు. దీంతో అక్కడ కోవిడ్ దాఖలాలు లేవు. అక్కడ కూడా మాస్కులను ధరించాల్సిన అవసరం లేదని చెప్పారు.
5. భూటాన్ లో కోవిడ్ టీకాల పంపిణీని సమర్థవంతంగా చేపట్టారు. అక్కడ కేవలం 2 వారాల్లోనే యువ జనాభాలో 90 శాతం మందికి టీకాలు వేశారు. అక్కడ కోవిడ్ వల్ల ఇప్పటి వరకు కేవలం ఒక్క మరణం మాత్రమే సంభవించింది. అక్కడ కూడా మాస్కులను ధరించడం తప్పనిసరి కాదు అని చెప్పారు.
6. కోవిడ్ కేసులు తగ్గడం, ఎక్కువ మందికి టీకాలు వేయడం వల్ల హవాయిలో ప్రజలు ఇకపై ఆరుబయట మాస్కులను ధరించాల్సిన అవసరం లేదు. కానీ టీకాలను తీసుకునే చోట్ల మాస్కులను ధరించాలి. ప్రజలు పర్యాటక ప్రాంతాలలో పర్యటించేందుకు అనుమతులు ఇచ్చారు.