ఈ రోజుల్లో పెర్ఫ్యూమ్ వాడని వారంటరూ ఉండరూ కదా.. ఎక్కడికి వెళ్లాలన్నా పెర్ఫ్యూమ్ బాగా కొట్టుకుని వెళ్తే ఆ మజానే వేరు. నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా చూపుతుంది. అయితే మనం రెగ్యులర్ గా వాడే పెర్ఫ్యూమ్ ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమే.. టీవీ యాడ్స్ చూసి, పక్కనవాళ్లు వాడుతున్నారని, స్మెల్ బాగా వస్తుందని ఏదిపడితే అది వాడొద్దంటున్నారు నిపుణులు. పెర్ఫ్యూమ్ ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం..
సీజన్‌ను బట్టి..
మనం వాడే పెర్ఫ్యూమ్ సీజన్‌ను బట్టి మార్చాలి. అన్ని వేళలా ఒకటే వాడతా అంటే కుదరదు. వేసవికాలంలో చర్మం ఎక్కువ తేమగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కంటే వేసవిలోనే పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువ సమయం ఉంటుంది. ఎందుకంటే తేమ ఆ వాసనను పోగొట్టకుండా కాపాడుతుంది. కాబట్టి తక్కువ గాఢత ఉండే పెర్ఫ్యూమ్ను వేసవిలో, ఎక్కువ గాఢత ఉండే వాటిని చలికాలంలో ఎంచుకోవాలి
టెస్టింగ్ ఇలా చేయాలి.
పెర్ఫ్యూమ్ కొనేప్పుడు ఎవరైనా టెస్ట్ చేసే తీసుకుంటారు. అయితే ఆ టెస్టింగ్ కేవలం మంచి సువాసన వస్తుందా అనే కాకుండా.. శరీరం నుంచి వెలువడే సహజ నూనెలతో కలిస్తే దాని వాసన ఏమైనా మారుతుందా లేదా అనేది గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం నుంచి వెలువడే సహజ నూనెలతో పెర్ఫ్యూమ్ కలిస్తే దాని వాసన మారకపోతే అది మంచిదని భావించవచ్చు. కాబట్టి పైపైన వాసన చూడటం కంటే కొంచెం చేతులపై స్ప్రే చేసుకుంటే పెర్ఫ్యూమ్ మంచిదో కాదో మీకే తెలిసిపోతుంది.
మరీ ఘాటు వద్దు..
గాఢత మరీ ఎక్కువగా ఉండే పెర్ఫ్యూమ్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పెర్ఫ్యూమ్ ఉపయోగించాలి. కొందరు వాడే పెర్ఫ్యూమ్ స్మెల్ వల్ల మనకు కడుపులో తిప్పేస్తుంది. ఛీ ఏంట్రావాసన అని మొఖం మీదే అనేస్తాం. అలా మనల్ని ఎవరూ అనొద్దంటే.. ఘాటు మరీ ఎక్కువ ఉండేవి తీసుకోకూడదు. మనం వాడే పెర్ఫ్యూమ్ స్మెల్ కి పక్కనవారి ఇంప్రస్ అయిపోవాలి. ఏం కంపెనీ అని అడిగితే మనసులో భలేగా ఉంటంది కదా.!
తేమగా ఉన్నప్పుడే..
స్నానం చేసిన తర్వాత శరీరం తేమగా ఉన్నప్పుడే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే దాని వాసనను శరీరం బాగా పీల్చుకుంటుంది. మనం స్నానానికి ఉపయోగించే సబ్బు వాసన.. పెర్ఫ్యూమ్ వాసన కంటే తక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి.. అప్పుడే పెర్ఫ్యూమ్ ఎక్కువ సువాసనలు వెదజల్లుతుంది. అలాగే శరీరానికి రాసుకునే మాయిశ్చరైజర్, పెట్రోలియం జెల్లీలు ఎలాంటి వాసన లేకుండా ఉన్నవైతే ఇంకా మంచిది. లేకుంటే అన్నీ వాసనలు మిక్సై.. అది వేరే టైప్ స్మెల్ వస్తుంది.
ఇక్కడ పెట్టొద్దు
పెర్ఫ్యూమ్ని పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఇలా చేస్తే అది సువాసనను కోల్పోకుండా ఉంటుంది. ఇంట్లో ఉన్న కొన్ని ఏరియాల్లో సూర్యకిరణాలు పడతాయి. అలాంటి ప్రదేశంలో పెర్ఫ్యూమ్ ఉంచుకోకూడదు.