తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాలు ప్రజల బాగోగులని పట్టించుకోవడం మానేసి పర్సనల్‌గా రాజకీయ దాడులకు దిగుతున్నట్లు కనబడుతోంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు చూస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి..వాటిని ఎలా పరిష్కరించాలనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పక్కనబెట్టేసినట్లు ఉన్నారు. అటు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు వదిలేసినట్లు కనిపిస్తున్నారు.
ఇరు పక్షాలు…ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకుంటూ, పైచేయి సాధించాలని తెగ కష్టపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య జరుగుతుంది ఇదే రాజకీయం అని చెప్పొచ్చు. అవును తెలంగాణలో డ్రగ్స్ వాడకం పెరుగుతుంది. డ్రగ్స్ వల్ల యువత నాశనమవుతుంది…అటు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. ఈ డ్రగ్స్ వల్ల చిన్నారులు కూడా బలి అవుతున్నారు. కానీ ఈ డ్రగ్స్‌ని అరికట్టడంలో కేసిఆర్ ప్రభుత్వం విఫలమైనట్లే కనిపిస్తోంది.
అయితే దీనిపై పోరాడుతున్నట్లే కనిపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు…కాస్త ఇందులో రాజకీయం కూడా చేస్తుంది. రేవంత్ రెడ్డి డ్రగ్స్ అరికట్టడంపై చర్యలు తీసుకోవాలనే చెబుతూనే, తాను డ్రగ్ టెస్ట్ చేయించుకుంటానని, అలాగే కేటిఆర్ కూడా చేయించుకోవాలని ఛాలెంజ్ విసిరారు. అటు కేటిఆర్ ఏమో..రాహుల్ గాంధీ చేయించుకుంటే తాను చేయించుకుంటానని…అక్కడ రాజకీయం చేశారు. దీని తర్వాత లై డిటెక్టర్ టెస్ట్‌లు, పరువు నష్టం దావా వరకు ఈ రచ్చ జరిగింది.
రేవంత్ ఏమో తెలివిగా కేటిఆర్‌ని ఇరికించాలని ప్రయత్నించారు…కేటిఆర్ ఇంకా తెలివిగా రాహుల్ గాంధీని ఇందులోకి తీసుకొచ్చారు…అలాగే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే రాజద్రోహం కేసు పెడతానని చెప్పి, మళ్ళీ పరువు నష్టం దావా వేశారు. అసలు రేవంత్, కేటిఆర్‌లు పక్కాగా రాజకీయ క్రీడ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం వదిలేసి…ఇలా పనికిమాలిన రాజకీయాలు చేస్తూ పర్సనల్ ఎటాక్‌లకు దిగడం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు.