ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. ఆ దేశంలో మే 9వ తేదీన నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్ ఆహ్వానం పంపింది. విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రతి ఏటా మే 9వ తేదీన విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తోంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈసారి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పలు దేశాలకు సంబంధించిన నేతలను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి ఆహ్వానం పంపింది. గతేడాది జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను భారత్ సందర్శించాలని మోదీ ఆహ్వానించారు. దీనికి పుతిన్ కూడా అంగీకరించారు. కానీ ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదు.