ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే చంద్రబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం విశాఖలో టీడీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే చంద్రబాబు పర్యటనకు మాత్రమే ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. అది కూడా కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో పర్యటించాలన్నారు.
మరియు ఎలాంటి ర్యాలీలు చేయకూడదన్నారు. దీంతో విశాఖ పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పర్యటనకు పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదని అన్నారు. తమను అడ్డుకునేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నాలు జరుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశావని, ప్రజా చైతన్యకు వస్తున్నావని ప్రశ్నిస్తున్నారు? ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పకుండా.. కేవలం అమరావతి మాత్రమే రాజధాని అంటున్న చంద్రబాబు తీరును విశాఖ వాసులు తప్పుబడుతున్నారు.