టిఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. జూబ్లీహిల్స్ లోని అరవింద్ నివాసంలోకి చెరబడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ ఘటనలో దాదాపు 100 మంది టిఆర్ఎస్ కార్యకర్తల వరకు పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంపీ అరవింద్ ఇంటి పై దాడి చేసిన 40 మందిని పోలీసులు గుర్తించారు. టిఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. వీరిని పట్టుకునే పనిలో పడ్డారు. మరోవైపు దాడికి గురైన అరవింద్ ఇంటిని బిజెపి నేతలు సందర్శించారు. టిఆర్ఎస్ గుండాలే ఈ పనికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.