కేసీఆర్ వరుస భేటీలు.. థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు కోసమేనా?

-

తెరాస అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావుతో ఎవరూ ఊహించని విధంగా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెర తీసింది. ఈ భేటీకి వారం రోజుల ముందు సీపీఐ(ఎం), సీపీఐ అగ్రనేతలతో కూడా గులాబీ బాస్ సమావేశమయ్యారు. అంతకు నెల రోజుల క్రితం డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌‌ను కలిశారు. ఈ పరిణామాలతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటుపై చర్చ మొదలైంది. కొత్త ఫ్రంట్‌కు తెరాస అధినేత సారథ్యం వహించనున్నట్లు ప్రచారం సైతం జరుగుతున్నది.

అయితే, సీఎం కేసీఆర్‌తో తేజస్వీ యాదవ్ భేటీలో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని తెరాస నేతలు పేర్కొంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతనే దేశ రాజకీయాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదన్నారు.

2019, సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసే యత్నించారు. బీజూ జనతాదల్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలతో కలసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేశారు. దేశ పరిపాలనలో మార్పు కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉన్నదని కేసీఆర్ అన్నారు.

గత ఎన్నికల్లో ఎన్‌డీఏ భారీ మెజారిటీతో విజయం సాధిచండంతో థర్డ్ ఫ్రంట్‌ ఆలోచనను కే చంద్రశేఖర్‌రావును పక్కన పెట్టారు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. కానీ, ఇటీవల కాలంలో కేంద్రం ప్రభుత్వం పట్ల కేసీఆర్ దృక్పథం మారింది. హుజూరాబాద్ ప్రతికూల ఫలితాల తర్వాత బీజేపీ పాలనపై పదునైన విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

వడ్ల కొనుగోలు విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను టీఆర్‌ఎస్ ఎంపీలు అడ్డుకున్నారు. అంతేకాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలను కూడా కారు పార్టీ వ్యతిరేకించడం ప్రారంభించింది. మూడు వ్యవసాయ చట్టాలతోపాటు రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీల సంయుక్త తీర్మానాన్ని సైతం మద్దతు తెలిపింది.

గత ఏడాది డిసెంబర్ 14 నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఆ రోజే వడ్ల కొనుగోలు వ్యవహారంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశారు. ఇరువురు నేతల కుటుంబ సభ్యులు కూడా సమావేశంలో ఉండటంతో మర్యాదపూర్వకమైన సమావేశం మాత్రమేనని, రాజకీయాలను చర్చించలేదని పేర్కొన్నారు.

గత శుక్రవారం సీఎం కే చంద్రశేఖర్ రావుతో సీపీఐ(ఎం), సీపీఐ నేతలు కలిశారు. బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటుపై నేతలు చర్చించారు. అయితే, ఈ సమావేశంపై టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ మాట్లాడటానికి నిరాకరించడం గమనార్హం. అయితే, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీతోనైనా వామపక్షపార్టీలు జతకట్టడానికి సిద్ధమని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌‌‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పాలిత గోవా రాష్ట్రంలో ఏ మేరకు సత్తా చాటుతుందనే విషయమై టీఆర్‌ఎస్ అధినాయకత్వం దృష్టి సారించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్ సీఎం కే చంద్రశేఖర్‌రావుతో భేటీ కావడం కీలకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version