ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు..!

-

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రణబ్‌ విశేషంగా కృషి చేశారని అన్నారు.

అలాగే ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరాడంబరత, నిజాయితీ, సత్ప్రవర్తనలకు ప్రతిరూపం ప్రణబ్ ముఖర్జీ అని పేర్కొన్నారు. ఆయన మన దేశానికి అంకితభావంతో, శ్రద్ధాసక్తులతో సేవ చేశారన్నారు. ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలు, కృషి అమూల్యమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

అలాగే ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. యాదాద్రి ఆలయ పనులను పరిశీలించి అభినందించారని ప్రణబ్ తెలంగాణ పర్యటనను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాగా, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన గతకొంత కాలంగా ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

అయితే ప్రణబ్ ముఖర్జీ 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు.  అలాగే ఆయన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సైనిక గౌరవ వందనంతో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news