గ్రేటర్‌లో పొలిటికల్ వార్ మళ్లీ మొదలైంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. కాలనీలన్నీ చెరువులయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లన్నీ ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఇదే సమయంలో వరద బాధితులకు పదివేల రూపాయల చొప్పున నగదు సాయం ప్రకటించింది ప్రభుత్వం. అయితే బాధితులకు నగదు అందజేసే విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన హడావిడిని తప్పుపడుతోంది కాంగ్రెస్. ఈ అంశంలోనే గ్రేటర్ వార్ రాజుకుంటోంది.
వరద బాధితులకు ప్రభుత్వం సాయం ప్రకటిస్తే.. ఆ సాయాన్ని బాధితులకు అధికారులు అందజేయాలి కానీ.. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా ఇవ్వడం ఏంటన్నది కాంగ్రెస్ అభ్యంతరం. GHMC ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి.. ఈ సాయాన్ని పార్టీ ప్రచారం కోసం వాడేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలు, విమర్శలపై టీఆర్ఎస్ ఘాటుగానే కౌంటర్ ఇస్తోంది. దసరా పండగ సమయంలో ప్రజలకు వెంటనే ఆర్థిక సాయం అందాలన్న ఉద్దేశంతో నగదు రూపంలో ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. పైగా నగదు సాయం పంపిణీలో ఎక్కడా లోపాలు జరిగినట్టు ఆరోపణలు, విమర్శలు రాలేదన్నది గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు టీఆర్‌ఎస్ నాయకులు. ఈ అంశంలో క్రమంగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికీ కారణమవుతోంది. ఒకవైపు కాలనీలు ఇంకా నీటిలోనే నానుతుండగా.. ఇలా రాజకీయ ఆధిపత్యానికి పార్టీలు చోటివ్వడంపై బాధితులు సైతం నోరెళ్లబెడుతున్నారట.