- సీఎం రమేష్ వర్సెస్ వరదరాజులరెడ్డి
- ప్రాణం ఉన్నంతవరకు సీఎం రమేష్‌ను ప్రొద్దుటూరులో అడుగుపెట్టనివ్వను
- వరదరాజులరెడ్డి‘వరద’ చర్యలను నిరసిస్తూ 22 మంది కౌన్సిలర్లు రాజీనామా
అమరావతి: కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రమవుతోంది. తన ప్రాణం ఉన్నంత వరకూ ఎంపీ సీఎం రమేశ్‌ను ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటానని ఆ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి శపధం చేశారు. తన వైఖరిని తప్పుబడుతూ సీఎం రమేశ్ వర్గానికి చెందిన 22 మంది ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు రాజీనామా చేయడాన్ని వరదరాజులరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక విషయంలో సీఎం రమేష్ వర్సెస్ వరదరాజులరెడ్డి వర్గాల మధ్య మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వి.ఎస్.ముక్తియార్ వ్యవహారంపై వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కండువా వేసుకుని టిడిపిలో కొనసాగడం ఎంతవరకు సబబో చెప్పాలని డిమాండ్ చేశారు. ముక్తియార్‌ను అప్పుడూ ఇప్పుడూ ఎంపీ సీఎం రమేశ్ వెనుక నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారని వరద రాజుల రెడ్డి ఆరోపించారు. 22 మంది టిడిపి కౌన్సిలర్ల రాజీనామాలకు ప్రధాన కారణం.. ఎంపీ సీఎం రమేశ్ కుటుంబంలోని వ్యక్తులు ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనతో ఉండటమేనని విమర్శించారు.
వరదరాజులపై చర్య తీసుకోవాలి- కౌన్సిలర్లు
ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తీరును నిరసిస్తూ సోమవారం మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు తెలుగుదేశంపై తిరుగుబాటు చేస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. వీఎస్ ముక్తియార్ నేతృత్వంలో ఆయన ఇంటి వద్ద నుంచి కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు జనంతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. దారి వెంట వారు వరద రాజులరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదనుపార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, వరద హఠావో.. టీడీపీ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార పార్టీ కౌన్సిలర్ల రాజీనామా విషయం చర్చనీయాంశంగా మారింది.
వరద నియంతలా వ్యవహరిస్తున్నారు
రాజీనామా అనంతరం వీఎస్ ముక్తియార్ మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటిలో జరిగే ప్రతి పనిలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇన్‌చార్జి పేరుతో జోక్యం చేసుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారాడన్నారు. అందుకు నిరసనగా కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు రాజీనామా చేశారని తెలిపారు. వరదరాజులరెడ్డిపై సీఎంకు, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి, జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామన్నారు. అధిష్టానం సంప్రదింపులు జరిపి వరదరాజులరెడ్డిపై చర్యలు తీసుకుంటే తప్ప రాజీనామాలను ఉపసంహరించుకోమన్నారు.