అచ్చెన్న ప్రకటన: వార్నింగా.. రిక్వస్టా..?

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి దెబ్బ‌కు అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌లే కాదు, రాష్ట్రస్థాయి నేత‌లు కూడా వ‌ణికిపోతున్నారు. స్వ‌ప‌క్షం, విప‌క్షం అనే తేడా ఏమాత్రం లేకుండా.. మనసులో ఉన్న మాటలు నేరుగా బయటపెట్టేసే జేసీ బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం వీరిపై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు  అచ్చెన్నాయుడు.. ఓ హెచ్చరిక ప్రకటన చేశారు!

acham naidu

పార్టీ నేత‌లు ఎవ‌రైనా గీత దాటి వ్య‌వ‌హ‌రిస్తే వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య త‌ప్ప‌దు. తెలుగుదేశం పార్టీ నియ‌మావ‌ళికి విరుద్ధంగా పార్టీ నాయ‌కుల‌పై బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసినా.. ప్ర‌సార మాధ్యమాల‌తో మాట్లాడినా.. సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెట్టినా.. వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌దు. అని అచ్చెన్న హెచ్చరించారు!

దీంతో… కాల‌వ శ్రీ‌నివాసుల‌తో పాటు ప్ర‌భాక‌ర్‌ చౌద‌రి, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిల‌పై వివిధ మాధ్య‌మాలు వేదిక‌గా ఘాటైన వ్యాఖ్య‌లు చేసిన జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి, ఆయ‌న అనుచరుల‌పై ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలి. నిజంగా టీడీపీకి, అచ్చెన్నాయుడికి ద‌మ్ము, ధైర్యం వుంటే పార్టీ నియ‌మావ‌ళిని ధిక్క‌రించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ని నేరుగా హెచ్చ‌రించాలి. షోకాజ్ నోటీసులు ఇవ్వాలి! లేదంటే… గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పిలిపించి మాట్లాడినట్లు.. మాట్లాడుకోవాలి, బుజ్జగించుకోవాలి!

అంతేకానీ… ఇలా రిక్వస్టుల మీద రిక్వస్టులు చేసినట్లు.. వాటికి, “హెచ్చరిక” అనే ట్యాగ్ లైన్ తగిలించి చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పార్టీ నియ‌మావ‌ళిని అతిక్ర‌మించిన‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంలో ఉన్న భయం ఏమిటి? అచ్చెన్నకే తెలియాలి!

కాగా… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ ద‌క్కించుకున్న ఏకైక మున్సిపాలిటీగా తాడిప‌త్రి నిలిచింది. ఇది జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఘ‌న‌త‌గా పార్టీ అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. ఎందుకంటే స్వ‌యాన పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ అడ్ర‌స్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే!

– CH Raja