ఖమ్మంలో కారుకు పంక్చర్లు.. మళ్ళీ హస్తగతమేనా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళీ కారుకు పంక్చర్లు పడటం ఖాయమేనా? జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ సత్తా చాటుతుందా? అంటే ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. మామూలుగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద పట్టు లేదు. గతంలో ఇక్కడ కాంగ్రెస్-టీడీపీ పోటీ పడి గెలిచేవి. తెలంగాణ వచ్చాక జిల్లాలో టీఆర్ఎస్ హవా నడవలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్-వైసీపీ సత్తా చాటాయి. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో…ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు.

ఇక 2018 ఎన్నికల్లో జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ హవా నడిచింది…జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకుని 8 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ 6, టీడీపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీటు వచ్చింది. అటు ఒక సీటులో ఇండిపెండెంట్ గెలిచారు..కానీ రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలని లాగేసుకుంది. 4 గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకున్నారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్ లో ఉన్నారు.

అయితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని మాత్రం లాగింది గాని… ఖమ్మం జిల్లాలో బలం పెంచుకోలేకపోయింది.. కాంగ్రెస్ బలం తగ్గించలేకపోయింది. పైగా జంపింగ్ ఎమ్మెల్యేల వల్ల టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, పాలేరు, వైరా, అశ్వరావుపేట, పినపాక నియోజకవర్గాల్లో కారు పార్టీలో సెగలు వస్తున్నాయి. ఈ సెగలు వల్ల కారు పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పటికే ఆధిపత్య పోరు వల్ల అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఇంకా మరికొందరు కూడా టీఆర్ఎస్ పార్టీని వదిలేసేలా ఉన్నారు. మొత్తానికి ఖమ్మంలో మళ్ళీ కారుకు డ్యామేజ్ జరిగేలా ఉంది…ఇక్కడ బీజేపీ బలం తక్కువ కాబట్టి మళ్ళీ హస్తం పార్టీ సత్తా చాటేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news