టీడీపీకి మ‌రో దెబ్బ‌.. వైసీపీ గూటికి కీల‌క నాయ‌కురాలు..!

శృంగవరపుకోట అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిసైన్ చేస్తూ పార్టీలో పని చేసే వారికే గుర్తింపు లేదంటూ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజకీయ భవిష్యత్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఏపీని పాలించిన టీడీపీ నేడు విభజిత ఏపీలోనూ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

TDP-Party | టీడీపీ

ఇక తెలంగాణాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిందని, కేడర్ కూడా లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఫుల్ ఫోకస్ విభజిత ఏపీ మీద పెట్టినప్పటికీ పార్టీ బలోపేతం కావడం లేదనే చర్చ కూడా సాగుతున్నది.

టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే విషయమై పార్టీ వర్గాల్లోనూ డిస్కషన్ సాగుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీలో ఏళ్ల నుంచి పని చేస్తున్న కార్యకర్తలు, నేతలు పార్టీని వీడుతున్నారని అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. టీడీపీ అధినేత కానీ పార్టీ లీడర్లు కానీ తమ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లే సమయంలో కానీ, కార్యకర్తలను ఆదుకునే విషయంలో కానీ శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల నుంచి స్పష్టమైన హామీ ఉండటం వల్లే శోభా హైమావతి టీడీపీని వీడారనే ప్రచారం నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. బలమైన మహిళా నేత పార్టీని వీడే సమయంలో పార్టీ నుంచి వీడొద్దనే మాట కూడా రాలేదని తెలుస్తోంది.